క్రీస్తులో ప్రియమైన సహోదరులకు శుభాబివందనములు!
నేడు మనం బైబిల్ బోధించే నరకం గురించి పరిశోధించడానికి, నరకం అంటే ఏమిటి? సాధారణంగా, నరకం అంటే శిక్ష కోసం దేవునిచే ఏర్పాటు చేయబడిన అగ్ని స్థలమని, అక్కడ చనిపోయిన దుష్ట మనుష్యులు నిత్యకాలం యాతన అనుభవిస్తారని అన్ని మతాల వారు నమ్ముతారు. క్రైస్తవులలో కూడా ఈ నమ్మకం ఉంది. ఇది దేవునిచే చేయబడిన ఏర్పాటు అని, దేవుడే నరకాన్ని సృష్టించాడని నమ్మబడుతుంది. కీడు చేసిన ఆత్మలను శిక్షించే బాధ్యతను దేవుడు సాతానుకు ఇచ్చాడని, అతడే ఈ నరక శిక్షకు యజమాని అని చెబుతుంటారు. ఇంకా, సాతాను “నరకానికి అధికారి” అని, అతను నరకంలో ఉన్నా అక్కడి అగ్నిని ఎదిరించే శక్తి కలిగి, ఇంట్లో ఉన్నట్లుగా నరకంలో సుఖంగా ఉంటాడని నమ్మబడుతుంది.
ఇవన్నీ దేవుని మనుష్యులమని చెప్పుకునే వారు రాసిన పుస్తకాల్లో, నవలల్లో, మాస పత్రికల్లో కళ్లకు కట్టినట్లు వివిధ రకాలుగా చిత్రించబడ్డాయి. ఇవన్నీ నిజమేనా? దేవుని వాక్యాలు వీటిని బోధిస్తున్నాయా? అలాగైతే నరకం అనేది భూమి లోపల ఉందా? భూమిని తవ్వితే, దాని లోపల పాపం చేసిన వారు ఉన్నారా? భూమి లోపల పాపం చేసిన వారందరూ ఉండేలా అది ఖాళీగా ఉందా? వీటన్నింటినీ నరక బోధకులు, దానిని నమ్మేవారు ఎందుకు ఆలోచించరు? ఈ నరకం గురించిన వచనాలను పరిశోధించే ముందు, దేవుని న్యాయమైన భావాలు ఏమిటో మరియు నరకం గురించిన మరెన్నో విషయాలను బైబిల్ వచనాల ద్వారా పరిశోధిద్దాం.